JustPaste.it

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చిత్ర విచిత్రమైన వేషాలేస్తున్నారు. నిన్న నల్ల చొక్కాలతో అసెంబ్లీలో సందడి చేసిన నారా చంద్రబాబునాయుడు, ఈ రోజు ఖాకీ చొక్కా ధరించి 'నేను ఆటోవాడ్ని..' అంటూ హల్‌చల్‌ చేసేశారు. ఏమో, ముందు ముందు చంద్రబాబు నుంచి ఇలాంటి అద్భుత నాటకాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోగానీ.. జనానికి మాత్రం 'వేషమూ మార్చెను.. బాషనూ మార్చెను.. అయినా మనిషి మారలేదు..' అంటూ సాగే ఓ పాత పాట గుర్తుకొస్తోంది. బహుశా ఆ పాటని చంద్రబాబు లాంటోళ్ళ గురించే రాసి వుంటారేమో కూడా.

ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు ఇలాంటి వేషాలు వేయాల్సిందేనా.? అంటే, తప్పదు మరి.. రాజకీయం అంటేనే ఓ రంగస్థలం. జనాన్ని వంచించడానికి ఎన్ని పిల్లిమొగ్గలైనా వేయాల్సిందేనని చంద్రబాబు లాంటోళ్ళు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే వుంటారు. నాలుగున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేశావయ్యా.? అని ఎవరన్నా నిలదీస్తే, 'ఇదిగో నేను చేసింది..' అని చూపించుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు, 'నరేంద్రమోడీ సహకరించలేదు.. లేకపోతే చాలా చేసేవాడ్ని..' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

2014 ఎన్నికల సమయం నాటి తెలుగుదేశం పార్టీ గ్రాఫిక్స్‌ వీడియోల్ని, ఆ సమయంలో తెరపైకి తెచ్చిన 'ప్రకటనల్ని' ఒక్కసారి చూస్తే, వాటిని ఇప్పటి పరిస్థితులతో పోల్చితే.. చంద్రబాబు నాలుగున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ని ఎంతలా ఉద్ధరించేశారో అర్థమయిపోతుంది. 2018 చివరినాటికే రాజధాని అమరావతి తొలి ఫేజ్‌ సిద్ధమయిపోతుందని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. ఏదీ ఎక్కడ.? అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం టీడీపీ నేతల వద్ద దొరకదు. అంతా తాత్కాలిక నిర్మాణాల వ్యవహారమే. కొన్ని శాశ్వత భవనాల నిర్మాణం ప్రారంభమయినా, అవి ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశమే లేదు.

నేనుగానీ మళ్ళీ అధికారంలోకి రాకపోతే, రాజధాని అమరావతిని మార్చేస్తారు.. ఇంకో చోటకి తరలించేస్తారు.. అభివృద్ధి జరగదు.. పెన్షన్లు తీసేస్తారు..' అంటూ చంద్రబాబు తనంతట తానుగా దుష్ప్రచారానికి దిగారు.. జనాన్ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేసి మళ్ళీ గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రాన్ని నిన్న చంద్రబాబు నిలదీసిన వైనం బహు బాగున్నది.. కానీ, ఇలా నిలదీయాలని చంద్రబాబుకి ఎప్పుడో మూడు నాలుగేళ్ళ క్రితమే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చెప్పారు.. చెప్పడమేంటి, నెత్తీ నోరూ బాదుకున్నారు.

ప్రత్యేకహోదా అవసరమేంటో చంద్రబాబుకి అర్థమయ్యేలా చెప్పేందుకు వైఎస్‌ జగన్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. పైగా, అప్పట్లో ప్రత్యేకహోదా అడిగితే జైల్లో వేస్తామన్నారు.. నరేంద్రమోడీ చాలా చేసేశారు, ఇంకేం అదనంగా అడుగుతామన్నారు. కానీ, ఇప్పుడు ఇదే చంద్రబాబు.. అదే నరేంద్రమోడీని తూర్పారబడుతున్నారు. వేషం మార్చి, భాష మార్చితే.. మనిషి మారిపోయినట్లేనా.? ఛాన్సేలేదు.. ఇది జాతరలో పులివేషం లాంటిది మాత్రమే.!